ములుగు, వెలుగు: తన చెల్లిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనే కక్షతో యువకుడి తండ్రిని కిడ్నాప్ చేసి దాడికి పాల్పడిన ఘటన ములుగు జిల్లా మల్లంపల్లి మండలంలో వెలుగుచూసింది. ఈ కేసులో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్సై యు.ఉపేందర్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. రామచంద్రాపూర్ గ్రామానికి చెందిన రుద్రారపు శివ వేంకటేశ్వర్లపల్లికి చెందిన యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న యువతి అన్న గుగులోతు రాజేశ్ తన స్నేహితులు సునీల్, అరవింద్, హరికృష్ణ, హరిదాసుతో కలిసి బుధవారం రామచంద్రాపూర్‌కు వచ్చారు.
శివ కనిపించకపోవడంతో అతని తండ్రి అయిలయ్యను పట్టుకొని తీవ్రంగా కొట్టి ఆటోలో బలవంతంగా ఎక్కించారు. ఆటోలో తీసుకెళ్తూ దాడి చేశారు. బాధితుడి భార్య సునీత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించి నిందితులను గుర్తించారు. ఆటోలో పారిపోతుండగా మల్లంపల్లి వద్ద ఐదుగురిని అదుపులోకి తీసుకుని ములుగు జేఎఫ్‌సీఎం కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు తరలించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.

